అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మళ్లీ పాత ప్రత్యర్థులే తలపడనున్నారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. జార్జియా, హవాయి, మిస్సిస్సిప్పి, వాషింగ్టన్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిత్వానికి అవసరమైన మద్దతు ను బైడెన్ కూడగట్టుకున్నారు. ఇక, ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి కావాల్సిన ప్రతినిధుల మద్దతును ఇప్పటికే దక్కించుకున్నారు. దీంతో బైడెన్(81)ను ఆగస్టులో షికాగోలో జరగనున్న డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో అభ్యర్థిగా ప్రకటించడం లాంఛనమే. ఇక, రిపబ్లిక్ అభ్యర్థిగా జూలైలో ట్రంప్(77)ను అధికారికంగా ప్రకటించనున్నారు.
