సింగపూర్‌లో కొవిడ్-19 కొత్త వేవ్ కోరలు చాచింది. వారం రోజుల్లోనే 26 వేల మంది వైరస్ బారిన పడ్డారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ మధ్య 25,900 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యమంత్రి కుంగ్ తెలిపారు. ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాలని, కేపీ.2 వేరియంట్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దవాఖా నలు పడకల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కొవిడ్ కేసులు గరిష్ఠస్థాయిలో పెరుగుతాయని, జూన్ మధ్య వరకు కేసులు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ చివరివారంలో 13,700 కేసులు నమోదైనట్టు వివరించారు.
లాక్‌డౌన్లు, ఇతరత్రా సామాజిక ఆంక్షలు విధించే ఆలోచనలు ఏమీ లేవని ఆరోగ్య మంత్రి తెలిపారు. కోవిడ్ ఉపవైరస్‌లతో పెద్ద ప్రమాదం ఏమీ లేదని, ఇప్పుడు తలెత్తిన వేవ్‌ను ఓ పరిమిత స్థాయి అంటువ్యాధిగా పరిగణిస్తున్నట్లు వివరించారు. దీనిని అరికట్టేందుకు సరైన పద్ధతిలో వెళ్లుతామన్నారు. వైరస్‌ల కాలంలో వీటితో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే ఎవరికి వారుగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.