అక్రమ వలసదారుల ఏరివేతలో భాగంగా ఫెడరల్ అధికారులు చేపట్టిన దాడులతో లాస్ ఏంజెలెస్ అట్టుడుకుతోంది. లాస్ ఏంజెలెస్‌లో ఫెడరల్ అధికారులు జరిపిన దాడులతో నగరమంతా అట్టుడికిన సంగతి తెలిసిందే. ఫెడరల్ అధికారులకు స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నది. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలు, పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. దీంతో పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో నేషనల్ గార్డ్స్ దళాలకు చెందిన 2 వేల మందిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దింపారు.

ట్రంప్ చర్యకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్‌లో వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నిరసనకారులను కట్టడి చేసేందుకు అధికారులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, ఫ్లాష్ బ్యాంగ్‌లను ప్రయోగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిరసన కారులు మరింత రెచ్చిపోయారు. ట్రంప్ ప్రభుత్వం, స్థానిక అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసన కారుల చర్యతో నడిరోడ్లపై అనే కార్లు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిరసనకారులను అధికారులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు.
