అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు ప్రతియేటా దీపావళిని అంగరంగా వైభవంగా నిర్వహించుకుంటారనే విషయం తెలిసిందే. ఏకంగా దేశ అధ్యక్షుడు అధికార భవనం వైట్ హౌజ్‌లోనూ ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్‌లోని పెన్సిల్వేనియా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ రోజు స్టేట్ హాలీడే ప్రకటించింది. దీపావళి రోజున సెలవు ఇవ్వాలనే బిల్లును తాజాగా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీపావళిని జరుపుకునే పెన్సిల్వేనియా ప్రజల తరపున ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లును ఆమోదించడంలో సెనేటర్ జార్జ్ రోత్మన్తో కలిసి పనిచేయడం తాను గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.


కాగా, ఈ బిల్లును సెనేట్ 50-0 ఓట్ల తేడాతో ఆమోదించిందని రోత్మన్ తెలిపారు. దీంతో ఈ ఏడాది నవంబర్ 12న దీపావళి సందర్భంగా పెన్సిల్వేనియాలోనూ సెలవు రానుంది. ఇక పెన్సిల్వేనియాలో దాదాపు 2లక్షల మంది దక్షిణాసియా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే న్యూయార్క్ కూడా దీపావళి రోజున సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పెన్సిల్వేనియా కూడా అదే బాటలో నిర్ణయం తీసుకోవడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
