Namaste NRI

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో కలిసి వైట్ హౌస్‌కు చేరుకున్న మోదీ, ట్రంప్‌తో సమావేశమయ్యారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోదీ ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి. సుంకాలు, వలసలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడుతూ వైట్ హౌస్‌లో మళ్లీ ట్రంప్‌ను చూడటం సంతోషంగా ఉందని అన్నారు. 140 కోట్ల భారతీయు తరపున ట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి సేవ చేసేందుకు ప్రజలు తనకు మూడోసారి అవకాశమిచ్చారన్నారు. మరో 4 ఏళ్ల ట్రంప్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. భారత్`అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. అమెరికా ప్రయోజనాలే అత్యున్నతంగా ఉండేందుకు ట్రంప్ కృషి చేయడం సంతోషం. ట్రంప్‌లాగే నేను భారత్ ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టం. మేం రెట్టింపు వేగంతో పని చేస్తాం అని మోదీ అన్నారు.
అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారత్‌కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణమని ట్రంప్ అన్నారు. చాలా ఏళ్లుగా మోదీ నాకు స్నేహితుడు. మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తాం. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మాకు ఆయిల్, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయి. అవి భారత్‌కు కావాలి. మా ఇద్దరి మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉన్నాయి. దేశాలుగా భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం. మేం ఎవర్నీ ఓడిరచాలనుకోవట్లేదు. మంచి చేయాలని చూస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పని చేశాం. అమెరికాలో గత పాలన మాకు అంతరాయం కలిగించింది అని ట్రంప్ అన్నారు.

Social Share Spread Message

Latest News