జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 9న సీఎం బీరేన్ సింగ్ రాజీనామా సమర్పించటం, ఆ వెంటనే గవర్నర్ నివేదిక రాష్ట్రపతికి చేరటం వెంట వెంటనే జరిగిపోయాయి. మణిపూర్ గవర్నర్ అందజేసిన నివేదికతోపాటు ఇతర నివేదికల సమాచారం పరిశీలించాక, అక్కడ రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించే పరిస్థితి లేదనే నిర్ధారణకు వచ్చాం. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అధికారాలు ఉపయోగించి మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నాం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో మణిపూర్ శాసనసభ సుప్త చేతనావస్థలో వెళ్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
