ప్రధాని నరేంద్ర మోదీ 2023లో అమెరికాను సందర్శించిన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సతీమణికి అందజేసిన బహుమతులలో అత్యంత ఖరీదైన వజ్రం అందరి దృష్టిని ఆకట్టుకుంది. 7.5 క్యారట్ సింథటిక్ వజ్రాన్ని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుని సతీమణి జిల్ బైడెన్‌కు అందజేశారు. దీని ఖరీదు దాదాపు రూ.17.15 లక్షలు ఉంటుంది. 2023 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుని కుటుంబం అందుకున్న బహుమతులలో ఇదే అత్యంత ఖరీదైనదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
2023లో బైడెన్ దంపతులకు పలువురు విదేశీ నాయకులు లక్షలాది రూపాయలు విలువచేసే బహుమతులను అందజేశారు. అయితే ఈ బహుమతులను బైడెన్ దంపతులు వ్యక్తిగతంగా ఉపయోగించుకునే అవకాశం లేదు. ఇవన్నీ వైట్ హౌస్‌కే చెందుతాయి. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ దంపతులు ఈ వజ్రంతోపాటు ఇతర ఖరీదైన బహుమానాలను జాతీయ పురావస్తు శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే అధ్యక్షుని భార్యకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.