
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఈ నెల 5న హ్యాండ్సాఫ్ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించగా, తాజాగా శనివారం 50501 పేరిట భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ట్రంప్ దిగిపో అంటూ అమెరికా పౌరులు నినదించారు. పౌర హక్కులకు, చట్ట నిబంధనలకు ట్రంప్ పాతరేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. అమెరికాలో రాజులు లేరు’, ఫ్యూడల్ యుగం ముగిసింది అన్న స్లోగన్‌లతో హోరెత్తిస్తూ న్యూయార్క్, వాషింగ్టన్‌తో పాటు దేశంలోని పలు నగరాలలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నిరంకుశత్వాన్ని ఎదిరించండి, అమెరికాలో రాజులు లేరు అని నినాదాలు రాసిన ప్లకార్డులు చేతబట్టిన పౌరులు న్యూయార్క్‌లోని సిటీ మెయిన్ లైబ్రరీ బయట భారీ ప్రదర్శన జరిపారు.
