గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పక్కా కమర్షియల్. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 12న కర్నూలులో జరిగే వేడుకలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ చిన్న వీడియో గ్లింప్స్‌ను సినీ ప్రియులతో పంచుకున్నారు. అందులో గోపీచంద్ న్యాయవాదిగా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. మారుతి శైలి వినోదంతో పాటు గోపీచంద్ నుంచి కోరుకునే యాక్షన్ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. రాశి ఖన్నా ఓ సరికొత్త పాత్రలో వినోదాలు పంచనుంది. టైటిల్‌కు తగ్గట్లుగా పక్కా కమర్షియల్ సినిమా ఇది అని చిత్ర వర్గాలు తెలిపాయి. జేక్స్ బిజాయ్ స్వరాలందించారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కమర్ చావ్లా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.














