రష్యన్ పార్లమెంటు ఎన్నికల్లో పుతిన్ నేతృత్వంలోని పాలక పార్టీ విజయం సాధించింది. 99 శాతం బ్యాలెట్లు లెక్కించే సమయానికి పాలక యునైటెడ్ రష్యా పార్టీ దాదాపు 50 శాతం ఓట్లు సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. యునైటెడ్ రష్యా పార్టీకి సమీప ప్రత్యర్థిగా నిలిచిన రష్యన్ కమ్యూనిస్టు పార్టీ 19 శాతం ఓట్లు సాధించింది. గతంతో పోల్చుకుంటే కమ్యూనిస్టు పార్టీ బలం పెరిగింది. 450 స్థానాలున్న రష్యన్ డ్యూమా (పార్లమెంటు దిగువ సభ)లో పాలక పార్టీకి మూడిరట రెండొంతుల మెజార్టీ లభించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలలో పుతిన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి బాగా ఉన్నట్లు తేలింది. ఫలితాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. పశ్చిమ దేశాల మద్దతు ఉన్న ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నాల్నీని ప్రభుత్వం ఉగ్రవాదిగా ఆరోపిస్తూ అరెస్టు చేసింది. 2016లో ఎన్నికలు జరిగినప్పటి నుండి పార్లమెంట్‌లో యునైటెడ్ రష్యాకు పూర్తి స్థాయి మెజారిటీ వుంది. కమ్యూనిస్టు పార్టీ (కెపిఆర్‌ఎఫ్)కు 19.85 శాతం ఓట్లు లభించాయి. గతంతో పోల్చితే ఈ సారి కమ్యూనిస్టు పార్టీకి 7 శాతం అధికంగా ఓట్లు లభించాయి. మితవాత ఎల్‌డీపీఆర్ పార్టీ 7.56 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలవగా, ఎ జస్ట్ రష్యా పార్టీ 7.4 శాతం ఓట్లతో నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది.