సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజుల ముందు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు పదవీకాలం ముగుస్తున్న 56 మందిలో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి 10 మంది ఎంపీలున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చెరో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పదవీకాలం ముగుస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ (టీడీపీ), సీఎం రమేశ్ (బీజేపీ), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వైఎస్సార్సీపీ) ఉండగా, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ పదవీకాలాలు ముగుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి కాకపోయినా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ తెలుగు నేత జీవీఎల్ నరసింహారావు పదవీకాలం కూడా ఏప్రిల్ నెలతో ముగుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 15 కాగా, ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం గం. 9.00 నుంచి సాయంత్రం గం. 4.00 వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ వెంటనే సాయంత్రం గం. 5.00 నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒకవేళ పోటీ లేకపోతే ఫిబ్రవరి 15 నాటికే అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవమవుతుంది.