ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ వ్యూహం, శపథం చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమాల్లో అజ్మల్, మానస ముఖ్య పాత్రల్ని పోషించారు. వ్యూహం ఈ నెల 23న, శపథం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ట్రైలర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ వ్యవస్థ. ఏ కథ తీసినా వాళ్లకు అభ్యంతరాలుంటాయి. ఈ సినిమాలో కొన్ని సీన్స్ తీసివేశారు. అయినా కథలోని ఎమోషనల్ కంటెంట్ మిస్ కాలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఫిలిం మేకర్‌కు వాస్తవ ఘటనలను తన కోణంలో చూపించే అధికారం ఉందని హైకోర్టు మాకు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వై.యస్.రాజశేఖర్ రెడ్డి మృతి నుంచి వై.యస్.జగన్ ప్రమాణ స్వీకారం వరకు వ్యూహం కథ ఉంటుంది. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం నుంచి చంద్రబాబు జైలుకు వెళ్లేవరకు శపథం కథలో చూపిస్తున్నాం అన్నారు. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని 500 థియేటర్లలో ఈ చిత్రాలను విడుదల చేయబోతున్నామని తెలిపారు.