తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం పరేషాన్. రూపక్ రోనాల్డ్సన్ దర్శకుడు. ఈ సినిమాకు హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాతలు. ఈ చిత్రంలో పావని కరణం, బన్నీ అభిరాం, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, బుద్దరాఖాన్ రవి, రాజు బెడిగేలా ప్రధాన పాత్రలు పోషించారు. థియేట్రికల్ ట్రైలర్ను ఆవిష్కరించారు. రానా మాట్లాడుతూ ఈ సినిమా చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నా. తిరువీర్ ఘాజీ సినిమాలో నాతో కలిసి నటించాడు. ఈ సినిమాలో నేనూ భాగమైనందుకు గర్వంగా ఉంది అన్నారు. దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ మంచిర్యాలలో పుట్టి పెరిగి అక్కడే ఈ కథ రాసుకున్నాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మనసారా నవ్వుకున్నామని చెబుతున్నారు. ఈ సినిమాలో చాలా మంది కొత్తవారు నటించారు అని హీరో తిరువీర్ చెప్పారు. అల్లరి చిల్లరగా తిరిగే కొంత మంది యువకుల జీవితంలో చోటుచేసుకునే అనూహ్య సంఘటనల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని దర్శకుడు తెలిపారు. జూన్ 2న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది.