ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపిఎల్ ట్రోఫీ కల తీరింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగళూరు తన ఖాతాలో తొలి టైటిల్‌ను జత చేసుకుంది. మంగళవారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో బెంగళూరు ఆరు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.


ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఛాలెంజర్స్ బౌలర్లు సఫలమయ్యారు. కీలకమైన ఫైనల్లో పంజాబ్ బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (24), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26)లు శుభారంభం అందించిన ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపింది. జోష్ ఇంగ్లండ్ (39), శశాంక్ సింగ్ 61 (నాటౌట్)లు తప్ప మిగతా వారు విఫలం కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. బెంగళూరు బౌలర్లలో కృనాల్, భువనేశ్వర్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

