అణ్వాయుధాల విన్యాసాలను నిర్వహించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు. నావికా దళం, వాయుసేన, పదాతి దళం కూడా వీటిలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సమీపంలోని దళాలు కూడా వీటిలో పాల్గొంటాయి. ఉక్రెయిన్‌తో రెండేళ్ల నుంచి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ అణ్వాయుధ యుద్ధం జరిగే ముప్పు ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. వ్యూహాత్మకం కానటువంటి అణ్వాయుధాలను వినియోగించడం, సమాయత్తం చేయడం కోసం కొన్ని చర్యలు తీసుకుంటారు. రష్యా భౌగోళిక సమగ్రతను కాపాడుకోవడం కోసం త్వరలోనే ఈ విన్యాసాలు జరుగుతాయి. కొందరు పాశ్చాత్య దేశాల నేతల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.