సాయిపల్లవి కథల ఎంపికలో చాలా చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. కెరీర్ ఆరంభం నుంచి ప్రతీ చిత్రంలో తనదైన మార్క్ చూపిస్తూ విలక్షణ నాయికగా గుర్తింపును తెచ్చుకుందీ. నేడు సాయిపల్లవి జన్మదినం. ఈ సందర్భంగా నాగచైతన్యతో కలిసి ఆమె నటిస్తున్న తండేల్ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సాయిపల్లవి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నది.
గ్రామీణ నేపథ్యంలో దేశభక్తి ప్రధాన అంశాలతో దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య జాలరి రాజు పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి ఆయన భార్య బుజ్జమ్మగా కనిపించనుంది. అనూహ్య పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం చేతిలో బందీ కాబడ్డ భారత జాలరులు అక్కడి నుంచి ఎలా బయట పడ్డారు? దేశభక్తిని గుండెల్లో నింపుకున్న ఆ మత్స్యకారుల బృందం చేసిన సాహసాలేమిటన్నదే ఈ చిత్ర కథాంశం. నేడు సాయిపల్లవికి చెందిన స్పెషల్ వీడియోను కూడా చిత్ర బృందం విడుదల చేయనుంది. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్, సమర్పణ: అల్లు అరవింద్, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.