ప్రియదర్శి, రూపా కొడువాయుర్ జంటగా నటించిన చిత్రం సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం. ప్రతిష్టాత్మక శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా నుంచి తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు. సారంగో సారంగా.. అమ్మాయి ఔనంది ఏకంగా.. సారంగో సారంగా ఆనందాలందుకో అనేకంగా అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, వివేక్ సాగర్ స్వరపరిచారు. ఆర్మాన్ మాలిక్ ఆలపించారు. హీరో ప్రేమకథకు మూలాధారం ఈ పాట. నిత్యజీవితంలో తనకు తారసపడేవారితో కథానాయకుడు సారంగపాణి తన ప్రేమని ఎలా ఆవిష్కరించాడో ఈ పాట చూస్తే తెలుస్తుంది. హైదరాబాద్ లోని విభిన్న ప్రదేశాల్లో ప్రియదర్శి, రూప కొడువాయూర్‌లపై వినూత్నంగా ఈ పాటను చిత్రీకరించాం. ఇందులో సరికొత్త ప్రియదర్శిని చూస్తారు అని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెలిపారు. నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.