
ఉపరాష్ట్రపతి ఎన్నికను సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 7న విడుదల చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపింది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ భవనంలోని మొదటి అంతస్తులో నిర్వహిస్తామని పేర్కొంది. గత నెల 21న జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా, మరో ఇద్దరు అధికారులు ఆయనకు సహాయకులుగా ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్‌సభకు చెందిన సభ్యులు ఓటర్లుగా ఉంటారని పేర్కొంది. రాజ్యసభకు నామినేట్ అయినవారు కూడా ఓటు వేయవచ్చని తెలిపింది.
















