Namaste NRI

తానా మహాసభల్లో పాఠశాల స్టాల్

అమెరికాలోని డెట్రాయిట్‌లో మూడు రోజుల పాటు తానా 24వ మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో  భాను మాగులూరి ఆధ్వర్యంలో పాఠశాల  స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, పద్మ భూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ప్రారంభించారు. భాషే బంధానికి మూలమని శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, తంగిరాల సౌమ్య అన్నారు.  

ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ భాష వారసత్వ సాంస్కృతిక సంపదని అన్నారు. ఈ తరానికి, గడచిన తరాలకూ మధ్య భాషే వారధి అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ పిల్లలకు ఏ భాషలో విద్యాబోధన చేసినా వారికి చక్కని తెలుగు నేర్పించాల్సిన బాధ్యత ఇక్కడి సమాజంపై ఉందని అన్నారు. అందుకు తానా-పాఠశాల ఈ బాధ్యతను స్వీకరించి ఉదాత్తంగా పనిచేయటం అభినందనీయమని అన్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ భాషను చంపే తరంగా మనం మిగిలి పోకూడదని అన్నారు. ఇక్కడ తెలుగు భాషను, కళలను తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలని అన్నారు. అనంతరం బాల బాలికలకు తెలుగు పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, మన్నవ సుబ్బారావు, భక్త భల్ల, సతీష్ చింతా, వెంకట్ కోగంటి, నాగ పంచుమర్తి, సునీల్ దేవరపల్లి, రంజిత్ కోమటి, రావు యలమంచిలితో పాటు పాఠశాల అధ్యాపకులు గీత మాధవి, రజని, అమృత, శ్రీ రంజిత పాల్గొన్నారు.   

Social Share Spread Message

Latest News