షేక్ హసీనాకు ఆశ్రయం వల్ల భారత్‌కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాకు ఆశ్రయంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలో ఉందని, బంగ్లా హోంశాఖ, న్యాయ శాఖ నుంచి ఏదైనా అభ్యర్థన వస్తే హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపాలని తాము భారత ప్రభుత్వాన్ని కోరాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ హసీనా భారత్‌లోనే ఉంటే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ భద్రతకు ముప్పు కలిగించే వాటిని అనుమతించబోమని ఆలంగీర్ స్పష్టం చేశారు. మైనారిటీల భద్రత బంగ్లాదేశ్ అంతర్గత విషయమని, హిందువులపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు తప్పని తెలిపారు.
