కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అక్కడ నిరసన సెగ తగిలింది. పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలో నిర్వహించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రాహుల్ ప్రసంగిస్తుండగా సభకు హాజరైన పలువురు ఖలిస్థానీ మద్దతుదారులు రాహుల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ వారు నినాదాలు చేయడంతో సభలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఖలిస్థానీ మద్దతుదారుల నినాదాలపై రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరినీ అభిమానిస్తుందని తెలిపారు. తాము ఎవరి పట్ల ఆగ్రహావేశాలను, ద్వేషాన్ని ప్రదర్శించబోమని స్పష్టం చేశారు.

