
అగ్రరాజ్యం అమెరికాకు షాక్ తగిలింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా నుంచి పడిపోయింది. 20 సంవత్సరాల తర్వాత తొలిసారిగా యూఎస్ పాస్‌పోర్ట్ టాప్-10 నుంచి దిగజారింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఆధారంగా విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో అమెరికా 12వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం, మలేషియాతో కలిసి యూఎస్ 12వ స్థానంలో నిలిచింది. అమెరికా పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు కేవలం 180 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇక, ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఆ తర్వాత దక్షిణ కొరియా (190), జపాన్ (189) ఉన్నాయి. అమెరికా ర్యాంక్ పడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ ఏడాది బ్రెజిల్ తన వీసా రహిత ప్రవేశం రద్దు చేసింది. అలాగే, చైనా కూడా వీసా అవసరం లేని దేశాల జాబితాలో యూఎస్‌ను చేర్చలేదు. మయన్మార్, పపువా న్యూగినియా వంటి దేశాలు సైతం ఆంక్షలు విధించాయి.
















