సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో డీజే టిల్లు, టిల్లు స్వేర్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆయన ఇదే సంస్థలో మరో చిత్రానికి సిద్ధమయ్యారు. ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహిస్తారు. సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రాల మాదిరిగానే వినూత్న కథాంశమిదని, వినోదానికి పెద్దపీట వేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రం తెలుసుకదా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాల విషయంలో సిద్ధు జొన్నలగడ్డ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం.















