ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థకు వణుకుపుట్టించిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ) పతనం మరో అమెరికా బ్యాంక్ మూసివేతకు కారణమయ్యింది. ఎస్‌వీబీ సంక్షోభం నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిగ్నేచర్ బ్యాంక్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసేందుకు డిపాజిటర్లు మూకుమ్మడిగా పరుగులు తీయడంతో ఈ బ్యాంక్‌ను న్యూయార్క్ స్టేట్ రెగ్యులేటర్లు మూసివేశారు. 110.36 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఆస్తులు (బ్యాంక్ ఇచ్చిన రుణాలు) ఉన్న సిగ్నేచర్ బ్యాంక్ వద్ద 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ తరహాలోనే సిగ్నేచర్‌లో కూడా బిజినెస్ ఖాతాదారులు ఎక్కువ. అధిక శాతం ఖాతాల్లో 2,50,000 లక్షల డాలర్లకు మించి నిల్వ ఉంటుంది. కేవలం 2.50 లక్షల డాలర్ల విలువ గల డిపాజిట్లకు మాత్రమే ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బీమా రక్షణ ఉంటుంది. ఎస్‌వీబీ ఉదంతం నేపథ్యంలో అమెరికాలో పలు చిన్న, ప్రాంతీయ బ్యాంక్‌లపై ఒత్తిడి ఏర్పడుతుందన్న విశ్లేషకుల అంచనాల్ని వాస్తవం చేస్తూ కేవలం రెండురోజుల వ్యవధిలోనే మరో బ్యాంక్ మూతపడింది.