భూమిపై మంచు కొండలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని, త్వరలో అవి మాయం కాబోతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఏటా 27.3 వేల కోట్ల టన్నుల మంచు కరిగిపోయి, మహా సముద్రాల్లోకి చేరుతున్నదని తెలిపింది. ప్రపంచంలోని మంచు కొండల విస్తృతి సగటున 5 శాతం తగ్గిపోయిందని, మధ్య యూరోపులో ఇప్పటికే దాదాపు 40 శాతం తగ్గిపోయిందని వెల్లడించింది. మంచు కొండలు కరుగుతుండటం వల్ల 2000వ సంవత్సరం నుంచి సముద్ర మట్టం 0.7 అంగుళాలు పెరిగిందని, మహా సముద్రాల్లో నీరు పెరగడానికి కారణమవుతున్న వాటిలో ఇది రెండోదని తెలిపింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
