యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్ బురఖా ధరించటాన్ని నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పివుంచరాదన్న చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు తాజాగా ప్రకటించింది. దీంతో బురఖాను నిషేధించిన ఏడో యూరోపియన్ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా, రెస్టారెంట్స్, దుకాణాలు సహా బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పివుంచరాదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే, 1,000 స్విస్ ఫ్రాంకుల (సుమారుగా రూ.98వేలు) వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే మెడికల్ మాస్క్‌లు, చలి వాతావరణంలో రక్షణ కోసం ధరించే వాటికి మినహాయింపులు ఇచ్చింది. ఆరోగ్యం, భద్రతా కారణాలు, సాంప్రదాయ ఆచారాల్లో ఫేస్ కవర్లు అనుమతిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది.