తెలంగాణ రాష్ట్రం నుండి దేశానికి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో త్వరలో స్పోర్ట్స్ పాలసీని అమలు చేయబోతున్నామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్‌లతో కలిసి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో 1988 ఒలంపిక్స్ క్రీడల సందర్భంగా నిర్మించిన క్రీడా మైదానాలను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు స్పోర్ట్స్ విలేజ్ రూపకల్పనపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామన్నారు.
భవిష్యత్తు లో ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్ లాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించేందుకు మన దేశానికి అవకాశం వస్తే వాటిని నిర్వహించే సత్తా తెలంగాణ రాష్ట్రానికే ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి క్రీడల నిర్వహణకు క్రీడా మైదానాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఆ దిశగా క్రీడ మైదానాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానాలు నిర్మిస్తున్నామని, రాష్ట్రం నుండి దేశానికి ఎక్కువ మంది అంతర్జాతీయ క్రీడాకారులను అందించడమే లక్ష్యమన్నారు.
దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడారంగంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని, ప్రపంచ దేశాలతో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే క్రీడలలో పోటి పడబోతుందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 17 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి పట్టణాలలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని తెలిపారు.