వైభవ్ సూర్య, రామకృష్ణ, విజయ్, లోహిత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ తెలంగాణ త్యాగధనులు. ఈ వెబ్ సిరీస్‌ను విజన్ వీవీకే ఫిలింస్ పతాకంపై వి. విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. నాగబాల సురేష్‌కుమార్ దర్శకుడు.ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవానికి ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, నిర్మాత విజయ్ కుమార్ క్లాప్ నిచ్చారు. ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇందులోని వందనం వందనం తెలంగాణ త్యాగధనులకు ఇదే వందనం అనే పాటను సీనియర్ నటి రోజా రమణి విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు నాగబాల సురేష్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరి జీవిత చరిత్ర ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాం. ఇది ఎన్ని సీజన్స్, ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే తెలంగాణ చరిత్ర చాలా పెద్దది. ఒక ప్రాంతానికి కాకుండా జాతీయ స్థాయిలో తెలియాల్సిన చరిత్ర ఇది. ఇవాళ విడుదల చేసిన ఈ పాటకు వెనిగళ్ల రాంబాబు సాహిత్యాన్ని అందించగా, ఖద్దూస్ సంగీతాన్ని అందించారు అన్నారు. నిర్మాత మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే కథలు కొన్నే ఉంటాయి.అలాంటి గుర్తుండిపోయే సబ్జెక్ట్ ఇది. లాభాపేక్ష లేకుండా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాను అన్నారు.