అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ (40) ఎన్నికయ్యారు. రచయిత అయిన వాన్స్ 2023 నుంచి ఓహియో సెనేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తెలుగింటి అల్లుడు. వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి(38) తెలుగమ్మాయి. దీంతో అమెరికా సెకండ్ లేడీ కానున్న మొదటి భారత సంతతికి చెందిన వ్యక్తిగా ఉష నిలవనున్నారు.
ఉషా చిలుకూరి తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి. వీరి బాల్యం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని వడ్లూరుతో పాటు కృష్ణ జిల్లా పామర్రులో సాగింది. దాదాపు 50 ఏండ్ల క్రితం వీరు ఉన్నత చదువుల కోసం ఆమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఉష తండ్రి రాధాకృష్ణ(క్రిష్ చిలుకూరి) ఏరోస్పేస్ ఇంజినీర్. తల్లి లక్ష్మి శాన్‌డియాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్. వీరికి 1986లో అమెరికాలోని శాన్‌డియాగోలో ఉష జన్మించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఆమె న్యాయవాద వృత్తిని చేపట్టారు.
అక్కడి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాన్ రాబర్ట్స్, బ్రెట్ కవనాగ్‌కు క్లర్క్‌గా, యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా, యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవెలప్‌మెంట్ ఎడిటర్‌గా ఆమె పని చేశారు. యేల్ లా స్కూల్‌లో ఆమెకు జేడీ వాన్స్‌తో పరిచయం ఏర్పడింది. 2014లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఎవాన్(6), వివేక్(4), మీరాబెల్(2) సంతానం.