2011 నుంచి ఇప్పటివరకు 16లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది. అత్యధికంగా గతేడాది 2.25 లక్షల మంది ప్రజలు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రాజ్యసభలో వెల్లడించారు. గత పదేళ్లలో ఇదే అత్యధికమని ఆయన పేర్కొన్నారు. 2022లో అత్యధికంగా 2,25,620 మంది, 2020లో అత్యల్పంగా 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వీడినట్లు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా 2011 నుంచి 2022 వరకు ఏడాది వారీగా పౌరసత్వాన్ని వీడిన భారతీయుల గణాంకాలను ఆయన తెలియజేశారు. విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2011లో 1,22,819 మంది, 2012లో 1,20,923 మంది, 2013లో 1,31,405 మంది, 2014లో 1,29,328 మంది, 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు జైశంకర్ వెల్లడించారు.