తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023 కార్యక్రమాన్ని దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ గత రెండేండ్లకు సంబంధించి నంది పురస్కారాలను ఈ వేడుకలో ఇవ్వబోతున్నాం. దీనికి సంబంధించి పరిశ్రమలోని వారితో ఓ జ్యూరీని ఏర్పాటు చేశాం. ఈ అవార్డ్ కార్యక్రమ తేదీని త్వరలో ప్రకటిస్తాం అన్నారు. రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ నేపథ్యంతో రూపొందించిన చిత్రాలకు ప్రత్యేకంగా నంది పురస్కారాలు ఇవ్వాలి. అలాగే ఇక్కడ అనేక అందమైన లొకేషన్స్ ఉన్నాయి. వాటిలో షూటింగ్ చేసే సినిమాలకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్, సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ పాల్గొన్నారు.

