భద్రతా మండలిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ) ఒక పాత క్లబ్ వంటిదని విదేశాంగశాఖ మంత్రి ఎస్ జై శంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టు కోల్పోతామనే భయంతోనే భద్రతా మండలి సభ్య దేశాలు, కొత్త దేశాలకు సభ్యత్వం ఇవ్వడం లేదని బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భద్రతా మండలిలో సంస్కరణలు తేవాలని భారత్ సహా పలు దేశాలు కోరుతున్నాయని అన్నారు. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టక పోవడం వల్లే ప్రపంచ వేదికలపై ఐరాస ప్రభావం తగ్గుతున్నదని స్పష్టం చేశారు.
ఒక విధంగా ఐరాసలో మానవ వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఈ వైఫల్యాలు ప్రపంచానికి హాని కలుగుతున్నాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారంలో ఐరాస అంతంత మాత్రమే. భద్రతామండలిపై తమ నియంత్రణ కొనసాగించడానికే సభ్య దేశాలు భావిస్తాయి. మరింత దేశాలకు సభ్యత్వం కల్పనపై వాటికి ఆసక్తి లేదు. భద్రతా మండలిలో ఆయా దేశాల కార్యకలాపాలను ఎవరైనా ప్రశ్నించడం సభ్యదేశాలకు నచ్చదు అని అన్నారు.