నాని కథానాయకుడిగా నటించిన చిత్రం హాయ్ నాన్న. శౌర్యువ్ దర్శకుడు. మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రల్ని పోషించారు. చిత్ర విజయాన్ని పురస్కరించుకొని బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ హాయ్ నాన్నలో నటించిన వారందరూ తమ సినిమా అని ఓన్ చేసుకున్నారు. అందుకే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. సినిమాకు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో నేను నమ్మింది నిజమైనందుకు ఆనందంగా ఉంది అన్నారు. బాక్సాఫీస్ లెక్కలను నేను అంతగా పట్టించుకోను. శుక్రవారం సినిమా విడుదలైతే నాని సినిమాకు వెళ్దాం పదా అని ప్రేక్షకులు అనుకున్నారంటే నా దృష్టిలో అదే గొప్ప స్థాయి. అంతకుమించిన స్థాయి ప్రపంచంలో మరొకటి లేదని నమ్ముతాను. ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను అన్నారు.
నాని వల్లనే సినిమాకు ఈ స్థాయి విజయం సాధ్యమైందని దర్శకుడు శౌర్యువ్ ప్రశంసించారు. కథ విన్నప్పుడే చాలా ఎమోషనల్‌గా అనిపించిందని, తమ బ్యానర్‌లో కలకాలం నిలిచిపోయే చిత్రమిదని నిర్మాతలు మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శి, బేబీ కియారా, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ తదితరులు పాల్గొన్నారు.