దిగుమతి సుంకాలు విధిస్తామని వాణిజ్య బెదిరింపులకు పాల్పడడం వల్లే ఇండియా, పాకిస్థాన్ మధ్య సంక్షోభం తెరపడినట్లు మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఓవల్ ఆఫీసులో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఆ రెండు దేశాలతో ఇటీవల తాను సాగించిన సంభాషణలు చాలా ప్రభావంతంగా పనిచేసినట్లు ఆయన చెప్పారు. వాణిజ్యం ద్వారా రెండు అణ్వాయుధ దేశాల మధ్య సమరోద్రిక్తతలను తగ్గించినట్లు వెల్లడించారు. అమెరికాకు వాణిజ్య సుంకాలు చాలా కీలకమైనవని పేర్కొన్నారు. టారిఫ్‌ల వల్లే తాము పీసీకీపర్లుగా ఉన్నామని చెప్పారు. వాణిజ్యం ద్వారా కేవలం వందల బిలియన్ల డాలర్లు ఆర్జించడమే కాదు, ఆ సుంకాలతోనే పీస్‌కీపర్ల పాత్ర పోషిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.

పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత, పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. అయితే మే 10వ తేదీన రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ డీల్‌కు తానే ప్రాణం పోసినట్లు ట్రంప్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే.
















