తెలంగాణ అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐల సహకారం చాలా అవసమరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (యూఎస్‌ఏ) సమావేశంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఎన్‌ఆర్‌ఐల కృషి చాలా ఉందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల రాష్ట్రంగా మార్చారు. విధ్వంస తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ఎన్‌ఆర్‌ఐల సహకారం అవసరం. రాష్ట్రం ఆర్థికంగా, దృఢంగా అభివృద్ధి చెందాలంటే ఉచితాలు మంచివి కావు. కానీ ప్రస్తుతం కొందరు పేదలు, అర్హులకు అవసరం అన్నారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశం కల్పించాలి. చేతి వృత్తులను ప్రోత్సహించాలి. ప్రభుత్వం ఇచ్చే ఉచితాల కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి రాకూడదన్నారు.
ప్రతి తెలంగాణ బిడ్డకు మెరుగైన విద్య, వైద్యం అవసరం. రాష్ట్రానికి ఆదాయ మార్గాలు సమకూరినప్పుడే ఏదైనా సాధ్యం అన్నారు. పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు.