అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలతో చైనా కుదేలవుతున్నది. ఆ దేశ తయారీ, నిర్మాణ రంగం కుదుపునకు గురైంది. ఎగుమతులు భారీగా పడిపోవడంతో పరిశ్రమలు షట్‌డౌన్‌లు, లేఆఫ్‌లు ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తింది. పరిశ్రమలు కొవిడ్ తర్వాత మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటంతో కార్మికులకు వేతనాలు కూడా చెల్లించడం లేదు. దీంతో కార్మికులు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ నిరసనలు, ఏప్రిల్ చివరి నాటికి తీవ్రమయ్యాయి. షాంఘై నుంచి ఇన్నర్ మంగోలియా వరకు దాదాపు అన్ని ఇండస్ట్రీ జోన్లలో కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. టోంగ్లియావో నగరంలో నిర్మాణరంగ కార్మికులు తమకు వేతనాలు చెల్లించకపోవడంపై భవనాలు ఎక్కి నిరసన వ్యక్తంచేశారు. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.

జనవరి నుంచి వేతన బకాయిలు పేరుకుపోవడంపై షాంఘైలోని ఓ ఎల్‌ఈడీ లైట్ల ఫ్యాక్టరీలోని వేల మంది కార్మికులు రోడ్డెక్కారు. దావో కౌంటీలో ఓ స్పోర్ట్స్ కంపెనీని ఎలాంటి సమాచారం లేకుండానే మూసేశారు. ఈ నేపథ్యంలో టారిఫ్‌లపై అమెరికా చర్చలకు ముందుకు వస్తుందని చైనా వాణిజ్య శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
