తన సంపద గురించి అసత్యాలు ప్రచారం చేసిన కేసులో దిగువ కోర్టు విధించిన రూ.3,788 కోట్ల (45.4 కోట్ల డాలర్ల ) భారీ జరిమానాను నిలిపివేయాలని కోరుతూ అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించారు. అయితే, దిగువ కోర్టు ఉత్తర్వు అమలుకాకుండా నిలిపి వేయటానికి అప్పీల్స్ కోర్టు ఓ షరతు విధించింది. పది రోజుల్లో రూ.1,460 కోట్ల (17.5 కోట్ల డాలర్ల)ను చెల్లించా లని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని జమ చేసినట్లయితే రూ.3,788 కోట్లను వసూలు చేయకుండా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
ట్రయల్ కోర్టు జరిమానాను గడువులోగా చెల్లించకుంటే ట్రంప్ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ట్రంప్‌నకు విధించిన భారీ జరిమానాను చెల్లించడం సాధ్యం కాదని ఆయన తరపు న్యాయవాది అప్పీల్స్ కోర్టుకు విన్నవించుకున్నారు. ట్రంప్ తన ఆస్తుల గురించి అసత్యాలు ప్రచారం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారని గత నెల 16న ట్రయల్ కోర్టు నిర్ధారించి, భారీ జరిమానా విధించింది.