తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. జనవరి 28వ తేదీ నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి జనవరి 30 వరకు అవకాశం కల్పించారు. అలాగే 31వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించి, 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన చైర్ పర్సన్స్, మేయర్ల ఎన్నిక ప్రక్రియ చేపడతారు.

రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.















