దేవరకొండ విజయ్ హీరోగా నటించిన చిత్రం కింగ్‌డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం. ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్న నేపథ్యంలో, ఈ సినిమాలోని తొలి గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ఏదో ఏదో గమ్మత్తులా.. ఏంటీ కలా.. ఏంటీ కలా.. ఏదో ఏదో అయ్యేంతలా.. గుండె అలా.. ముంచేనిలా.. హృదయం లోపల.. ఖననం జరిగెనా అంటూ సాగే ఈ పాటను కె.కె. రాయగా, అనిరుధ్ రవిచందర్ స్వరపరిచి, అనుమిత నదేశన్‌తో కలిసి ఆలపించారు. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సేలపై ఈ పాట చిత్రీకరించారు.

కథలో భాగంగా సాగే మాంటేజ్ సాంగ్ ఇది. హీరో క్యారెక్టరైజేషన్, హీరోహీరోయిన్ల మధ్య సాగే రహస్య ఒప్పందం, తద్వారా వారిమధ్య చిగురించిన ప్రేమబంధం, ఇవన్నీ ఈ పాటలో దర్శనమిస్తున్నాయి. ఈ పాటను బట్టి చూస్తే, విజయ్ దేవరకొండ కిల్లర్‌గా, భాగ్యశ్రీ బోర్సే డాక్టర్‌గా కనిపిస్తున్నారు. పాట కూడా శ్రావ్యమైన సంగీతంతో వినసొంపుగా సాగింది. పిక్చరైజేషన్ కూడా ట్రెండీగా, కథపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ పాట విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్‌కి హీరో విజయ్ దేవరకొండ కృతజ్ఞతలు తెలియజేశారు.

3, వీఐపీ చిత్రాల టైమ్‌లోనే అనిరుధ్ సంగీతానికి అభిమానిని అయిపోయా. అతనితో కలిసి పనిచేయాలనే కోరిక ఎప్పట్నుంచో ఉండేది. హీరోనైన పదేళ్ల తర్వాత నా పదమూడో సినిమాకు అది సాధ్యమైంది. మా తొలి కలయికలో మొదటి గీతం విడుదల కావడం సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ నెల 30న సినిమా విడుదల కానుంది.