తూర్పు ఆసియా దేశమైన జపాన్‌లోని హిరోషిమా నగరంలో జీ -7 దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి 21 మే వరకు మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. జీ -7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్‌లకు చెందిన అధినేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ జీ -7 దేశాల సమావేశాల కోసం హిరోషిమాకు వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా అణుబాంబు దాడికి గురైన హిరోషిమాలోని హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్ దగ్గర వివిధ నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సమావేశాల్లో జీ -7 దేశాల అధినేతలు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండించడంతోపాటు ఉక్రెయిన్‌కు తమ మద్దతును కొనసాగించే అవకాశం ఉంది.ఈ జీ -7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి ఈసారి జపాన్ అధ్యక్షత వహిస్తున్నది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ ఆహారం, ఎరువులు, ఇంధన భద్రత సహా ప్రపంచ సవాళ్లపై ప్రసంగించనున్నారు. అదేవిధంగా ఈ సమావేశాలకు హాజరయ్యే అధినేతల్లో కొందరితో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.