నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ఆయ్. అంజి కె.మణిపుత్ర దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని పిఠాపురంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బన్నీవాసు మాట్లాడారు. ఇది పక్కా గోదారోళ్ల సినిమా. నవ్వి నవ్వి థియేటర్ల నుంచి బుగ్గలు, పొట్ట నొప్పితో బయటకు వస్తారని గ్యారెంటీగా చెప్పగలను. పిఠాపురంలో ఈ వేడుక జరపడం ఆనందంగా ఉంది. మా సంగీత దర్శకుడు రామ్ మిర్యాలది ఈ ఊరే అని ఇప్పుడే తెలిసింది. అందుకే ఇందులోని పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశారాయన. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది అని అన్నారు.
తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరంతా సక్సెస్ రూపంలో ఇవ్వాలని నార్నె నితిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రైలర్ ఎంత ఎంజాయ్ చేశారో, సినిమాను అంతకు మించి ఎంజాయ్ చేస్తారని, నవ్విస్తూనే చిన్న చిన్న ఎమోషన్స్ టచ్ చేశామని దర్శకుడు అంజి కె.మణిపుత్ర చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులతోపాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ కూడా మాట్లాడారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది.