పాకిస్థాన్ అదే పనిగా యుద్ధం వార్నింగ్ ఇస్తోంది. ఆ దేశ రాజకీయ నేత బిలావల్ భుట్టో తాజాగా మళ్లీ హెచ్చరిక చేశారు. ఒకవేళ సింధూ జలాలను ఇండియా నిలిపివేస్తే, అప్పుడు యుద్ధం చేయడం తప్ప పాకిస్థాన్‌కు మరో అవకాశం లేదని భుట్టో పేర్కొన్నారు. ఇండియా ఇప్పటికే తమకు తీవ్రమైన నష్టం చేసిందని, పాకిస్థానీలందరూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో పిలుపునిచ్చారు.

సింధ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వ చర్యలు పాకిస్థాన్‌కు నష్టాన్ని మిగిల్చాయని, ప్రజలందరూ ఐక్యంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. పాకిస్థానీ ప్రజలను రెచ్చగొట్టిన భుట్టో, ఆరు నదులను తీసుకువచ్చేందుకు పాకిస్ధానీలు శక్తివంతంగా ఉన్నట్లు చెప్పారు. ఒకవేళ ఇండియా ఇదే వైఖరితో కొనసాగితే, అప్పుడు తమకు దారులు లేవని, జాతి ప్రయోజనాలను కాపాడుకునేందుకు యుద్ధమే శరణ్యం అవుతుందని భుట్టో అన్నారు.















