చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేపుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నుంచి కొత్తగా నమోదయ్యే రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ నెల ఆఖరుకల్లా వారానికి 4 కోట్ల చొప్పున కొత్త కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందని, జూన్ నెలాఖరుకల్లా వారానికి 6.5 కోట్ల చొప్పున కొత్త కేసులు నమోదు కావచ్చని చైనాకు చెందిన రెస్పిరేటరీ డిసీజ్ స్పెషలిస్ట్ ఝోంగ్ నాన్‌షన్ అంచనా వేశారు. గ్వాంగ్‌ఝౌలో జరిగిన బయోటెక్ కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఝోంగ్ నాన్‌షన్ ఈ అంచనాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో చైనాలో కరోనా వైరస్ కట్టడికి తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం దేశ ప్రజలందరికీ బూస్టర్ డోస్ ఇప్పించే ప్రయత్నంలో చైనా ఆరోగ్య శాఖ ఉంది. దేశ ప్రజలంతా కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరికలు జారీచేస్తోంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. గత వేవ్‌లలో జరిగినంత నష్టం ఈ వేవ్‌లో కూడా జరగకుండా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చైనా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది.


