అల్లు అర్జున్ హీరోగా రూపొందిన చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం డిసెంబర్ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌ని దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగం చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడారు. నన్ను కన్న ఈ నేలకు వందనం. ప్రమోషన్స్‌కి చాలా ప్లేస్‌లకు వెళ్తుంటా. కానీ చెన్నైకి వస్తే ఆ ఫీలే వేరు. నా మొదలు ఇక్కడే కాబట్టి అదో సైకలాజికల్ ఫీలింగ్. నా తొలి 20ఏళ్లు చెన్నైలోనే ఉన్నా. ఈ సంస్కృతే నన్ను తయారు చేసింది. నేను సాదాసీదా చెన్నై టి నగర్ కుర్రాడ్ని. డైరెక్టర్ సుకుమార్ నా డైరెక్టర్ కాదు. నా లైఫ్. తను లేకపోతే నేను లేను. పుష్ప తో నన్ను ప్రపంచాని కి పరిచయం చేశాడు. దేవిశ్రీ అందరికీ గొప్ప మ్యూజిక్ ఇస్తాడు. నాకు ప్రేమతో కలిపి ఇస్తాడు. నాలుగేళ్లు ఒకే హీరోయిన్‌తో జర్నీ చేశా. తనే రష్మిక. ఇందులో తన నట విశ్వరూపం చూస్తారు. నిజంగా శ్రీలీల డాన్సింగ్ క్వీన్. తనతో డ్యాన్స్ అంటే ఫస్ట్‌టైమ్ కాస్త జాగ్రత్త పడ్డా. పుష్ప2 టీమ్ ఓ అద్భుతం. డిసెంబర్ 5న ప్రేక్షకులకు పండుగే. ఎక్కడా తగ్గేదేలే అని అల్లు అర్జున్ అన్నారు.
ఈ కార్యక్రమంలోనే ఈ సినిమాలోని కిస్సిక్ సాంగ్‌ని లాంచ్ చేశారు. కథానాయికలు రష్మిక మందన్నా, శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, అర్చన కల్పాతి, కలైపులి ధాను, ఆదిత్యరామ్, డైరెక్టర్ నెల్సన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.