ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడులకు పాల్పడింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేసింది. దీంతో ఆ దేశ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి హుస్సేన్ సలామీతోపాటు పలువురు అణు శాస్త్రవేత్తలు మృతిచెందారు. అది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కావచ్చు. మా సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి అంటూ పశ్చిమాసియాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడులకు దిగడం గమనార్హం. అయితే ఈ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా ప్రకటించింది. తమ ప్రమేయం లేకుండానే ఇజ్రాయెల్ దాడులు చేసిందని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటన విడుదల చేశారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఏకపక్ష చర్యలకు దిగిందని రూబియో అన్నారు. ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని తెలిపారు. ఆ ప్రాంతంలోని అమెరికన్ దళాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యత. దీనికి సంబంధించి ఇప్పటికే తాము చర్యలు తీసుకున్నాం. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్‌కు స్పష్టంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా. అమెరికా ప్రయోజనాలను గాని, సిబ్బందిని గాని లక్ష్యంగా చేసుకోకూడదని చెప్పారు.
