
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. విజయశాంతి కీలక పాత్రధారి. ఈ సినిమాలోని ఓ పాటను ఏపీలోని నరసరావుపేట రవికళామందిర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ అమ్మలను గౌరవించడం మన బాధ్యత. వారికోసం ఎలాంటి త్యాగం చేసినా తక్కువే. ఈ సినిమా అమ్మలందరికీ అంకితమిస్తున్నా అన్నారు. విజయశాంతిగారు ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా చేయడం జరిగిందని, ట్రైలర్ లాంచ్‌లో చెప్పినట్లుగానే తన కెరీర్‌లో ఇరవైఏళ్లు గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు. పల్నాటి పౌరుషం మొత్తం కల్యాణ్‌రామ్ పాత్రలో కనిపిస్తుందని, ఆయన కెరీర్‌లో ఇంటెన్స్ రోల్‌గా మిగిలిపోతుందని దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెలిపారు. భారీ స్థాయిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత అశోక్ వర్ధన్ ముప్పా పేర్కొన్నారు. సోహైల్‌ఖాన్, సాయిమంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్నారు. త్వరలో విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు, రచన-దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి.
