శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మణిశంకర్. జి.వెంకట్ కృష్ణన్ తెరకెక్కించారు. కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాస రావు, ఎం. ఫణి భూషన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర పాటల విడుదల వేడుక హైదరాబాద్లో జరిగింది. నటులు మురళీ మోహన్, అశోక్ కుమార్, నిర్మాత సి. కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ ట్రైలర్ చూస్తుంటే డబ్బు చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని అర్థమవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ చిత్రంలో సంజన పోషించిన పాత్రలో చాలా కోణాలున్నాయి. జనవరి తొలి వారంలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు దర్శకుడు జి.వెంకట్. శివ కంఠమనేని మాట్లాడుతూ మంచి కథాంశంతో చక్కటి ఆలోచనతో దర్శకుడు వెంకట్ ఈ చిత్రం రూపొందించారు. ఇళయరాజ శిష్యుడు ఎం.ఎల్.రాజా ఈ సినిమాకి మంచి సంగీతమందించారు అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ జే ప్రభాకర్ రెడ్డి, సంగీత దర్శకుడు ఎం.ఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు.














