వ్యాక్సిన్‌పై నెలకొన్న అనుమానాలను వీడి, అందరూ టీకాలు వేసుకోవాలని భారత సంతతి చెందిన అమెరికన్ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దన్నారు. కరోనా మహమ్మారి కారణంగా తాను పది మంది కుటుంబసభ్యులను కోల్పోయానని చెప్పారు. వీళ్లలో కొందరు అమెరికాలో, మరి కొందరు భారత్‌లో నివసించేవారన్నారు. ఇప్పటి వరకూ 16 కోట్ల మంది అమెరికన్లు టీకాలు వేసుకున్నారని, ఇది గొప్ప విషయమని పేర్కొన్నారు. అయితే దేశ ప్రజలందరికీ టీకా రక్షణ లభిస్తేనే మహమ్మారికి కళ్లె పడుతుందని తెలిపారు. మనం చూస్తున్న ప్రతీ కరోనా మరణాన్ని వ్యాక్సిన్‌తో అడ్డుకొని ఉండేవాళ్లమని చెప్పారు.