అల్లరి నరేష్ కథానాయకుడిగా సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన చిత్రం బచ్చలమల్లి. ఈ నెల 20న విడుదల కానుంది. బచ్చలమల్లి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హీరో నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్షంలో అల్లరి నరేష్ అపస్మారక స్థితిలో పడివున్న సీన్‌తో ట్రైలర్ ఆసక్తి కరంగా మొదలైంది. బచ్చలమల్లిగా నరేష్ బోల్డ్, రగ్గ్‌డ్ క్యారెక్టర్‌లో సరికొత్త మేకోవర్‌తో కనిపించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చూసి నరేష్‌కి ఫోన్ చేశా. తప్పకుండా హిట్ అవుతుందని చెప్పాను. ఈ సినిమా కోసం ఏదైనా చేయాలనే తపనతో ఈవెంట్‌కు వచ్చాను. ట్రైలర్‌ను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
దర్శకుడు సుబ్బు తాను నటించిన మజ్ను సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడని, అద్భుతమైన ప్రతిభావంతుడని, ఈ కథను రియలిస్టిక్‌గా తెరకెక్కించాడని ప్రశంసించారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ నానితో 16 ఏళ్లుగా అనుబంధం కొనసాగుతున్నది. నేను ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు ధైర్యాన్నిచ్చాడు. దర్శకుడు సుబ్బు ఎంత అద్భుతంగా కథ చెప్పాడో అదే క్లారిటీతో సినిమా తీశాడు అన్నారు. ఈ సినిమాలో నరేష్ పాత్ర మరో స్థాయిలో ఉంటుందని దర్శకుడు సుబ్బు మంగాదేవి చెప్పారు. ఈ క్రిస్మస్‌కి బచ్చమల్లి మోత మోగిస్తాడని నిర్మాత రాజేష్ దండా ఆశాభావం వ్యక్తం చేశారు.