పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను నా జీవితాన్ని చాలా సింపుల్‌గా వుండాలనుకున్నాను. ఒక నటుడు అవ్వాలని, రాజకీయాల్లోకి రావాలని నేనెప్పుడూ ఊహించలేదు. సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇవ్వాలి. నేను సినిమా చేసేటప్పుడు అందులో సమాజానికి ఉపయోగపడే ఎంతోకొంత చిన్నపాటి విషయం వుంటే బాగుంటుంది అనుకుంటాను. ఇది చాలా సంపూర్ణమైన సినిమా. ఇది అందర్ని అలరిస్తుందని భావిస్తున్నాను. సినిమా అంటే నాకు ఇష్టం, సమాజం అంటే బాధ్యత . ఈ సినిమాని వేగంగా పూర్తి చేయడానికి ముందే సెట్లు రెడీ చేసి పెట్టుకొని, సరైన ప్రణాళిక చేసిన నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా నవ్విస్తుంది, బాధపెడుతుంది. గుండెల నిండుగా నవ్వుకుంటాం, నవ్వుతూ ఏడుస్తాం. ఇలాంటి చక్కటి సినిమాని అందించిన సముద్రఖని గారికి కృతఙ్ఞతలు అని అన్నారు.